గదుల ముందస్తు బుకింగ్‌ను రద్దు చేస్తే రీఫండ్‌ : టిటిడి ఈవో

230
ttd refund

 ఆన్‌లైన్‌లో ముందస్తుగా బుక్‌ చేసుకున్న గదులను రద్దు చేసుకుంటే ఆ సొమ్మును రీఫండ్‌ చేస్తామని టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌ తెలిపారు. నిర్ణీత సమయానికి కంటే ముందుగా గదులు ఖాళీ చేసినా కొంత మొత్తం తిరిగి చెల్లిస్తామన్నారు. దీనికి సంబంధించిన సాఫ్ట్‌వేర్‌ను అప్‌డేట్‌ చేసి జూలై నుంచి ఈ సౌకర్యాలను భక్తులకు అందుబాటులోకి తీసుకువస్తామని తెలిపారు. తిరుమలలోని అన్నమయ్య భవనంలో శుక్రవారం ఉదయం డయల్‌ యువర్‌ ఈవో కార్యక్రమం అనంతరం ఈవో మీడియాతో మాట్లాడారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

దర్శనం : 

– గతేడాది మేలో 23.34 లక్షల మంది భక్తులు స్వామివారిని దర్శించుకోగా ఈ ఏడాది మేలో 26.55 లక్షల మంది భక్తులు దర్శించుకున్నారు. గతేడాది కంటే 3.20 లక్షల మంది భక్తులు ఎక్కువగా స్వామివారిని దర్శించుకున్నారు. రోజుకు పది వేల మందికిపైగా దర్శనం చేసుకున్నారు.

– తిరుమలలో వేసవి రద్దీ కొనసాగుతుండడం వల్ల బ్రేక్‌ దర్శనాలను బాగా పరిమితం చేసి ఎక్కువ మంది సామాన్య భక్తులకు శ్రీవారి దర్శనం కల్పిస్తున్నాం. ఈ విషయంలో టిటిడికి సహకరిస్తున్న ప్రముఖులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం.

– భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని లడ్డూల తయారీని పెంచడం జరిగింది.

అన్నప్రసాదం : 

– తిరుమల శ్రీవారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య గతేడాదితో పోలిస్తే 8 శాతం పెరిగింది. ఇందుకు తగ్గట్టు భక్తులకు అన్నప్రసాదాలు, తాగునీరు తదితర సేవలను 28 శాతం అదనంగా అందించాం.

శుభప్రదం : 

– విద్యార్థులకు సనాతన ధర్మంపై అవగాహన కల్పించి, మానవీయ, నైతిక విలువలు పెంచి ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దేందుకు టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్‌ ఆధ్వర్యంలో జూన్‌ 3 నుంచి 9వ తేదీ వరకు శుభప్రదం వేసవి శిక్షణ తరగతులు నిర్వహిస్తాం.

భక్తుల అభిప్రాయసేకరణ : 

– శ్రీవారి దర్శనార్థం కంపార్ట్‌మెంట్లలో వేచి ఉంటున్న భక్తుల నుంచి సమస్యలు, సూచనలు, అభిప్రాయాలను శ్రీవారి సేవకుల ద్వారా సేకరించి, తగు చర్యలు తీసుకుంటున్నాం. 

పిల్లలకు పాలు : 

– మా సర్వేలో పిల్లలకు పాలు సరిగా అందలేదని ఎక్కువ మంది భక్తులు తెలియజేశారు. ఇందుకోసం అన్నప్రసాద విభాగానికి ఆదేశాలిచ్చి ప్రతి కంపార్ట్‌మెంట్‌లో క్రమం తప్పకుండా అందరికీ పాలతో పాటు ఉప్మా, భోజనం అందేలా చర్యలు తీసుకున్నాం.  

హెల్ప్‌డెస్క్‌ : 

– ప్రతి కంపార్ట్‌మెంట్‌లో భక్తులు తాము ఎదుర్కొంటున్న పలు సమస్యలకు సంబంధించి సంప్రదించేందుకు ఈ నెలాకుఖరుకు హెల్ప్‌డెస్క్‌ ఏర్పాటుకు చర్యలు చేపట్టాం. తద్వారా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేసేందుకు కృషి జరుగుతోంది.

ఫోన్‌ వసతి : 

– కంపార్ట్‌మెంట్లలో వేచియున్న భక్తులు అవసరమైనచో తమ బంధుమిత్రులతో మాట్లాడుకునేందుకు ఉచిత ఫోన్‌ సౌకర్యాన్ని హెల్ప్‌ డెస్క్‌ ద్వారా అందుబాటులో ఉంచేందుకు కృషి చేస్తున్నాం. వచ్చే వారం నుంచి జూన్‌ ఆఖరులోపు అన్ని కంపార్ట్‌మెంట్లలో ఫోన్‌ వసతి కల్పిస్తాం.

డిస్‌ప్లే స్క్రీన్లు : 

– కంపార్ట్‌మెంట్లలో వేచియున్న భక్తులకు స్వామివారి దర్శన లేటెస్ట్‌ అప్‌డేట్స్‌, భక్తులకు ఉపయోగపడే సమాచారం తెలిపేందుకు డిస్‌ప్లే స్క్రీన్లు ఏర్పాటు చేస్తాం. కొన్ని కంపార్ట్‌మెంట్లలో ప్రారంభించి జులై నాటికి అన్ని కంపార్ట్‌మెంట్లలో స్క్రీన్లు ఏర్పాటుచేస్తాం.

వృద్ధులు, దివ్యాంగులకు టోకెన్‌ కౌంటర్లు : 

– గతంలో వృద్ధులు, దివ్యాంగులకు ఉదయం 750, మధ్యాహ్నం 750 టోకెన్లు ఇవ్వడం జరిగేది. అయితే, మధ్యాహ్న సమయానికి టోకెన్లు పొందడానికి ఉదయం నుండే భక్తులు నిరీక్షించాల్సిన పరిస్థితి ఉండేది. ఈ ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఉదయం నుండే 1500 టోకెన్లను పూర్తిగా అయిపోయే వరకు జారీ చేయడం జరుగుతోంది. తద్వారా షెడ్లలో ఎక్కువసేపు వేచి ఉండకుండా వారికి కేటాయించిన సమయంలో విచ్చేసి శ్రీవారిని దర్శించుకుంటున్నారు. దీనివల్ల ఎంతో ఉపశమనం పొందుతున్నారు.

గదుల ఆక్యుపెన్సీ : 

– గతేడాది మేలో గదుల ఆక్యుపెన్సీ 105 శాతం కాగా, ఈ ఏడాది మేలో ఆక్యుపెన్సీ 108శాతంగా నమోదైంది. 3 శాతం అదనంగా భక్తులు గదులను వినియోగించుకున్నారు. గదుల నిర్వహణను మెరుగుపరుస్తాం. గదులకు సంబంధించి ఫిర్యాదులను పరిష్కరించేందుకు ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటుచేస్తాం.

మొబైల్‌ యాప్‌ : 

– గోవింద మొబైల్‌ యాప్‌ను మార్చి 29న ప్రారంభించాం. ఈ రెండు నెలల కాలంలో దాదాపు 24,350 మంది భక్తులు రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు బుక్‌ చేసుకుని శ్రీవారిని దర్శించుకున్నారు.

అదేవిధంగా, తిరుమలలో నీటి సమస్య తలెత్తకుండా కల్యాణి డ్యామ్‌ నుంచి కొంతమేరకు సేకరించేందుకు చర్యలు తీసుకున్నట్టు ఈవో తెలిపారు. తిరుపతిలో భక్తులకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించేందుకు టిటిడి సిద్ధంగా ఉన్నట్టు వివరించారు. వేసవిలో ఎక్కువ సంఖ్యలో విచ్చేసిన భక్తులకు విశేషంగా సేవలందించిన టిటిడి అధికారులకు, సిబ్బందికి ఈ సందర్భంగా ఈవో అభినందనలు తెలియజేశారు.

సింహ వాహనంపై అనంతతేజోమూర్తి

తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి బ్రహ్మూెత్సవాల్లో మూడో రోజైన శుక్రవారం ఉదయం అనంతతేజోమూర్తి గోవిందరాజస్వామి సింహ వాహనంపై భక్తులకు అభయమిచ్చారు. ఉదయం 7.00 నుండి 8.30 గంటల వరకు స్వామివారు పురవీధుల్లో విహరించి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. వాహనం ముందు గజరాజులు ఠీవిగా కదులుతుండగా భక్తజన బ ందాలు చెక్కభజనలు, కోలాటాలు, కేరళ కళాకారుల డ్రమ్స్‌, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి వాహనసేవ కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు.

మ గాల్లో రారాజు సింహం. గాంభీర్యానికి చిహ్నం సింహం. యోగశాస్త్రంలో సింహం వాహనశక్తికి, శీఘ్రగమన శక్తికి ఆదర్శంగా భావిస్తారు. భక్తుడు సింహబలం అంతటి భక్తిబలం కలిగినప్పుడు భగవంతుడు అనుగ్రహిస్తాడు. అనంతతేజోమూర్తి శ్రీనివాసుడు రాక్షసుల మనస్సులలో సింహంలా గోచరిస్తాడని స్తోత్రవ్మాయం కీర్తిస్తోంది. అందుకే ధీరోదాత్తుడగు శ్రీ వేంకటేశ్వరుడు సింహవాహనాన్ని అధిరోహిస్తాడు.

అనంతరం ఉదయం 9.30 గంటల నుండి 11.00 గంటల వరకు స్వామి, అమ్మవార్లకు  స్నపన తిరుమంజనం వేడుకగా నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనం, పలురకాల పండ్ల రసాలతో అభిషేకం చేశారు. సాయంత్రం 6.00 గంటల నుండి 7.00 గంటల వరకు ఊంజల్‌సేవ వైభవంగా జరగనుంది. రాత్రి 8.00 నుండి 9.30 గంటల వరకు ముత్యపుపందిరి వాహనంపై స్వామివారు భక్తులకు దర్శనమివ్వనున్నారు.

నిత్య అలంకార ప్రియుడగు శ్రీవారు ఒక్కొక్కరోజు ఒక్కొక్క వస్త్రాభరణ అలంకారంలో దేదీప్యమానంగా వెలిగిపోతుంటాడు. ప్రత్యేకంగా మనస్సుకు ఆహ్లాదాన్ని కలిగించే ముత్యపుపందిరిపై భక్తులను చల్లగా ఆశీర్వదిస్తాడు. జ్యోతిషశాస్త్రం చంద్రునికి ప్రతీకగా ముత్యాలను ప్రశంసిస్తోంది. సముద్రం మనకు ప్రసాదించిన మేలివస్తువులలో ముత్యం ఒకటి. చల్లని ముత్యాల కింద నిలిచిన శ్రీనివాసుని దర్శనం తాపత్రయాలను పోగొట్టి, భక్తుల జీవితాలకు చల్లదనాన్ని సమకూరుస్తుందనడంలో సందేహం లేదు.

ఈ కార్యక్రమంలో శ్రీశ్రీశ్రీ షడగోప రామానుజ పెదజీయంగార్‌ స్వామి, శ్రీశ్రీశ్రీగోవిందరామానుజ చిన్నజీయర్‌స్వామి, తితిదే స్థానిక ఆలయాల ఉపకార్యనిర్వహణాధికారి శ్రీమతి వరలక్ష్మి, సహాయ కార్యనిర్వహణాధికారి శ్రీ ప్రసాదమూర్తిరాజు, ఇతర అధికారులు, భక్తులు పాల్గొన్నారు.

ధార్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు : 

తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి బ్రహ్మూెత్సవాల్లో భాగంగా శుక్రవారం జరిగిన సంగీత, సాంస్కృతిక కార్యక్రమాల వివరాలు ఇలా ఉన్నాయి.

శ్రీగోవిందరాజస్వామివారి ఆలయంలో ఉదయం 6.00 నుంచి 7.00 గంటల వరకు ఎస్వీ సంగీత, నృత్య కళాశాల విద్యార్థులు మంగళధ్వని, ఉదయం 7.00 నుంచి 8.00 గంటల వరకు తిరుపతికి చెందిన శ్రీమతి కె.ఇందిర బృందం విష్ణుసహస్రనామ పారాయణం చేశారు. సాయంత్రం 6.00 నుంచి 7.00 గంటల వరకు ఊంజల్‌సేవలో శ్రీమతి రాజేశ్వరి బృందం సంకీర్తనల ఆలాపన నిర్వహిస్తారు.

శ్రీ గోవిందరాజస్వామివారి పుష్కరిణిలో సాయంత్రం 7.00 నుంచి 9.00 గంటల వరకు రాజమండ్రికి చెందిన శ్రీ వి.బాబురావు బృందం హరికథ పారాయణం నిర్వహిస్తారు.

 


Advertisements

Leave a Reply