జూలై 12 నుండి తిరుమలలో టోకెన్‌ విధానం ద్వారా గదుల కేటాయింపు

0
537
Venkateswara Swamy

తిరుమల శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తులు గదుల కోసం ఎక్కువ సేపు వేచి ఉండకుండా చూసేందుకు, గదుల కేటాయింపులో మరింత పారదర్శకత పెంచేందుకు జులై 12వ తేదీ నుండి నూతనంగా టోకెన్‌ మంజూరు విధానాన్ని టిటిడి అందుబాటులోకి తీసుకురానుంది. ఇందుకోసం సిఆర్‌వో కార్యాలయంలో 10 కౌంటర్లు, ఎంబిసి-34 వద్ద ఒక కౌంటర్‌ను ఏర్పాటుచేశారు. ఉదయం 6 గంటలకు, మధ్యాహ్నం 2 గంటలకు రెండు స్లాట్లలో గదుల కేటాయింపునకు భక్తులు తమ పేర్లను నమోదు చేసుకోవాల్సి ఉంటుంది.

ఈ కౌంటర్ల వద్ద ఆధార్‌ నంబరు ద్వారా భక్తులు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. భక్తులు వేలిముద్ర వేసి, మొబైల్‌ నంబరును తెలియజేయాలి. ఎ కేటగిరీలో రూ.50/- నుంచి రూ.250/- వరకు అద్దె గల గదులు, బి కేటగిరీలో రూ.500/- నుంచి 1000/- వరకు అద్దె గల గదులు ఉంటాయి. భక్తులు గదుల అద్దె కేటగిరీని తెలపాల్సి ఉంటుంది. నమోదు ప్రక్రియ పూర్తయిన తరువాత టోకెన్‌ జారీ అవుతుంది. 

ఈ టోకెన్‌లో నమోదు సంఖ్య, భక్తుడి పేరు, మొబైల్‌ నంబరు, గది మంజూరు చేసేందుకు పట్టే సమయం తదితర వివరాలు ఉంటాయి. గది మంజూరైన తరువాత సంబంధిత సమాచారాన్ని భక్తుల సెల్‌ నంబరుకు ఎస్‌ఎంఎస్‌ ద్వారా తెలియజేస్తారు. అరగంటలోపు భక్తులు అలాట్‌మెంట్‌ కౌంటర్లకు వెళ్లి గదులు పొందాల్సి ఉంటుంది. గదుల అలాట్‌మెంట్‌ కోసం సిఆర్‌వోలో ఏడు కౌంటర్లు, ఎంబిసి-34 వద్ద ఒక కౌంటరు ఏర్పాటుచేశారు. ఇక్కడ గదుల కేటాయింపు సమాచారాన్ని తెలిపేందుకు డిస్‌ప్లే బోర్డులను ఏర్పాటుచేశారు. అరగంటలోపు గదులు పొందనిపక్షంలో ఆ తరువాత సీరియల్‌ నంబరు గల భక్తులకు కేటాయిస్తారు.

Advertisements

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here