విమాన వేంకటేశ్వర స్వామి
పూర్వం తిరుమల శ్రీ వేంకటేశ్వర ఆలయ అర్చకులు తొమ్మిదిమంది, స్వామివారి ఆభరణాలను ధరించారు. అది స్వామివారి దర్శనానికి వచ్చిన విజయనగర రాజు కంటపడింది. దాంతో ఆ రాజుకు ఆగ్రహం ముంచుకొచ్చింది. తొమ్మిదిమంది అర్చకులనూ విచక్షణా రహితంగా అక్కడికక్కడే చంపేశాడు.
నరహత్య మహాపాపం అనుకుంటే ఒకరు కాదు, ఇద్దరు కాదు ఏకంగా తొమ్మిదిమందిని హత్య చేశాడు రాజు. పైగా పవిత్ర దేవాలయంలో హత్య చేశాడు. అది సామాన్య దోషం కాదు. మహా పాపం. ఆ పాప పరిహారం కోసం వ్యాసరాయలు ప్రయత్నించారు. పన్నెండేళ్ళ పాటు భక్తులెవర్నీ ఆలయంలోనికి అనుమతించలేదు. వ్యాసరాయలవారు గర్భగుడిలో ప్రవేశించి, పాప నివృత్తి అయ్యేందుకు కఠోర దీక్షతో పూజలు నిర్వహించారట.
ఆ పన్నెండేళ్ళ కాలంలో భక్తులకు గర్భగుడిలో ఉన్న మూలవిరాట్టును దర్శించుకునే భాగ్యం కలగలేదు కానీ, అందుకు ప్రతిగా ఆనంద నిలయ విమానం మొదటి అంతస్తులో స్వామివారి విగ్రహాన్ని ప్రతిష్టించారు.
ఇలా ప్రతిష్టించిన వేంకటేశ్వర స్వామివారి విగ్రహం ఉత్తర వాయువ్యంలో ఉంటుంది. అప్పుడు ప్రతిష్టించిన స్వామివారి విగ్రహమే “విమాన వేంకటేశ్వర స్వామి“. అప్పుడు స్వామివారికి బదులుగా ప్రతిష్టించిన విమాన వేంకటేశ్వర స్వామిని ఇప్పటికీ భక్తిశ్రద్ధలతో దర్శించుకుంటారు. తిరుమల వెళ్ళిన భక్తులు తప్పనిసరిగా విమాన వేంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం ఆచారంగా మారింది.
ప్రస్తుతం ఆనంద నిలయానికి ఉత్తర వాయువ్యంలో విమాన వేంకటేశ్వరుని విగ్రహం వద్ద బంగారు, వెండి పూత పూసి, మరింత శోభాయమానంగా తీర్చిదిద్దారు. తిరుమల దర్శించుకున్న భక్తులు తప్పనిసరిగా విమాన వేంకటేశ్వరుని దర్శించుకుంటారు.
Discover more from Tirupati Tirumala Info
Subscribe to get the latest posts sent to your email.