శ్రీరామ నవమి విశిష్టత
శ్రీరామ నవమి హిందువులకు అత్యంత ముఖ్య మైన పండుగ. హిందువులు ఈ పండగను అత్యంత భక్తి శ్రద్దలతో ఈ పండగను జరుపుకుంటారు. శ్రీరాముడు వసంత ఋతువులో చైత్ర శుద్ధ నవమి, గురువారము నాడు పునర్వసు నక్షత్రపు కర్కాటక లగ్నంలో సరిగ్గా అభిజిత్ ముహూర్తంలో అంటే మధ్యాహ్మం 12 గంటల వేళలో త్రేతాయుగంలో జన్మించినాడు. ఆ మహనీయుని జన్మ దినమును ప్రజలు పండుగగా జరుపుకుంటారు.
పదునాలుగు సంవత్సరములు అరణ్యవాసము, రావణ సంహారము తరువాత శ్రీరాముడు సీతాసమేతంగా అయోధ్యలో పట్టాభిషిక్తుడైనాడు. ఈ శుభ సంఘటన కూడా చైత్ర శుద్ధ నవమి నాడే జరిగినదని ప్రజల విశ్వాసము. శ్రీ సీతారాముల కళ్యాణం కూడా ఈరోజునే జరిగింది. ఈ చైత్ర శుద్ధ నవమి నాడు తెలుగు ప్రజలు భద్రాచలమందు సీతారామ కళ్యాణ ఉత్సవాన్ని వైభవోపేతంగా జరుపుతారు. రామా అనే రెండక్షరాల రమ్యమైన పదం పలుకని జిహ్వ-జిహ్వే కాదు. శ్రీరామ నవమి పండుగను భారతీయులందరూ పరమ పవిత్రమైన దినంగా భావించి శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని అతి వైభవంగా పట్టణంలో, పల్లెపల్లెల్లోనూ రమణీయంగా జరుపుకోవడం ఓ సంప్రదాయం.
భక్తుల గుండెల్లో కొలువై, సుందర సుమధుర చైతన్య రూపమై, కోట్లకొలది భక్తుల పూజలందుకొంటున్నాడు శ్రీరామచంద్రుడు. శ్రీరామచంద్రుడిని తెలుగువారు ప్రతి ఇంటా ఇంటి ఇలవేలుపుగా కొలుస్తారు. నేటికి భ్రధ్రాచలంలో శ్రీరాముడి పర్ణశాల భక్తులకు దర్శనమిస్తూవుంటుంది. భధ్రాచలంలో అంగరంగ వైభవంగా కన్నుల పండుగగా జరిగే సీతారాముల కళ్యాణ మహోత్సవానికి లక్షలాది భక్తులు తరలి వస్తారు. కళ్యాణంలో పాల్గొని దానిని తిలకించి శ్రీరాముని దర్శించి ఆ దేవ దేవుడి ఆశీస్సులు పొందుతారు.
సీతారామ కళ్యాణం లోక జీవన హేతుకం, సకల దోష నివారణం, సర్వ సంపదలకు నిలయం, సకల జన లోక సంరక్షణమే శ్రీరామనవమి పండుగ పరమార్థం. శ్రీరామచంద్రుని క్షేత్రాలలో అత్యంత వైశిష్ట్య ప్రాధాన్యత ప్రాశస్త్యముగల క్షేత్రం భద్రాచలం దివ్య క్షేత్రం. భద్రుడు అనగా రాముడు అని అచలుడు అంటే కొండ అని అందుకే రాముడు కొండపై నెలవై ఉన్న దివ్య ధామము కనుక ఈ క్షేత్రం భద్రాచలంగా ప్రసిద్ధిచెందిన పుణ్య క్షేత్రం. |
శ్రీరామచంద్రుడు తన వనవాస జీవితం ఇక్కడే గడపడమే ఈ పుణ్య క్షేత్రం యొక్క వైశిష్ట్యం. శ్రీరామ నామము సకల పాపాలను పోగొడుతుందని సకల శాస్త్రాలూ చెబుతున్నాయి. భక్త రామదాసు చెరసాలలో ఉండిపోయిన కారణంగా పూర్వము సీతారాముల కళ్యాణము మార్గశిర శుద్ధ పంచమినాడు జరిగినట్లుగా, అయితే తాను చెరసాలనుండి తిరిగి వచ్చాక చైత్రశుద్ధ నవమినాడు శ్రీరామ చంద్రుని పుట్టినరోజు వేడుకలు, కళ్యాణ వేడుకలు ఒకేసారి జరిపించారు. శ్రీ సీతారామ కళ్యాణము, రాముడు రావణున్ని సంహరించి అయోధ్యకు తిరిగి వచ్చింది శ్రీరామనవమినాడే.
ఆ మరునాడు దశమి శ్రీరామ పట్టాభిషేకం రామునికి జరిగింది. కోదండ రామకళ్యాణాన్ని చూసేందుకు మనమే కాదు సకల లోకాల దేవతలు దివి నుంచి భువికి దిగివస్తారంటా…. శ్రీరామచంద్రుని దివ్య దర్శనం మహనీయంగా, నేత్ర పర్వంగా పట్ట్భాషేక సమయాన తిలకించి పులకితులవుతారట. ఆంజనేయుని పదభక్తికి మెచ్చి, హనుమ గుండెల్లో కొలువైన శ్రీరాముని భక్త పోషణ అనన్యమైనదై గ్రామగ్రామాన రామాలయం నెలకొని ఉన్నాయి.
శ్రీరాముడు సత్యపాలకుడు ధర్మాచరణం తప్పనివాడు, ఏకపత్నీ వ్రతుడు, పితృ, మాతృ, భాతృ, సదాచారం, నిగ్రహం, సర్వ సద్గుణాలు మూర్త్భీవించిన దయార్ద హృదయుడు. శ్రీరామనవమి రోజున సీతారాముని, లక్ష్మణ, భరత, శతృఘ్న, ఆంజనేయ సమేతముగా ఆరాధించి, వడ పప్పు, పానకము నైవేద్యముగా సమర్పించుకుంటారు. ప్రతియేడు భద్రాచలంలో జరిగే శ్రీ సీతారామ కళ్యాణము చూసి తరించిన వారి జన్మ సార్థకం చెందుతందనేది భక్తుల విశ్వాసం.