ముక్కోటి ఏకాదశి – వైకుంఠ ఏకాదశి

0
636
ముక్కోటి ఏకాదశి

ముక్కోటి ఏకాదశి

ముక్కోటి ఏకాదశి కోటి పుణ్యాలకు సాటి…
హైందవుల పండుగలన్నీ అయితే చంద్రమానం ప్రకారమో లేక సౌరమానం ప్రకారమో జరుపుకొంటారు. కానీ ఈ రెండింటి కలయికతో ఆచరించే పండుగ ఒకే ఒక్కటి. అదే ముక్కోటి ఏకాదశి! సూర్యుడు ధనుసు రాశిలో ప్రవేశించిన తరువాత (సౌరమానం) వచ్చే శుద్ధ ఏకాదశి (చంద్రమానం) రోజున ముక్కోటి ఏకాదశిని వైభవంగా జరుపుకొంటారు. ఈ పుణ్యతిథి గురించి మరిన్ని విశేషాలు…

ఈ రోజున ముక్కోటి దేవతలందరూ విష్ణుమూర్తిని దర్శించుకున్నారని ఓ గాథ. అందుకనే ఈ రోజుకి ముక్కోటి ఏకాదశి అన్న పేరు వచ్చిందట. ఇక ఈనాడే మధుకైటభులనే రాక్షసులకి శాపవిమోచనం కలిగించి, వారికి తన వైకుంఠ ద్వారం వద్ద దర్శనాన్ని అనుగ్రహించాడు విష్ణుభగవానుడు. తమలాగే ఈరోజున ఎవరైతే వైకుంఠ ద్వారాన్ని పోలిన ఉత్తరద్వారాన్ని నిర్మించి స్వామిని దర్శించుకుంటారో, వారికి మోక్షాన్ని ప్రసాదించమని వేడుకున్నారట వారిరువురూ. అప్పటినుంచీ ఉత్తర ద్వారం గుండా శ్రీవారిని దర్శించుకునే ఆచారం మొదలైంది. ఈ ఏకాదశినాడే వైకుంఠంలోని విష్ణుమూర్తివారి ఆంతరంగిక ద్వారాలు తెరుచుకున్నాయి కాబట్టి దీనికి ‘వైకుంఠ ఏకాదశి’ అన్న పేరూ స్థిరపడింది.

అసలు ఏకాదశి అంటేనే హిందువులకి పరమ పవిత్రమైన రోజు. పూర్వం మురాసురుడనే రాక్షసుని సంహరించేందుకు, విష్ణుమూర్తి నుంచి ఒక అంశ వెలువడిందట. ఆమే ఏకాదశి అనే దేవత! ఏకాదశి సేవకు మెచ్చిన విష్ణుమూర్తి, తిథులలోకెల్లా ఏకాదశి గొప్ప తిథిగా ఎంచబడుతుందనీ, ఎవరైతే ఆ రోజు నిష్ఠగా ఏకాదశి వ్రతాన్ని చేస్తారో వారు వైకుంఠాన్ని చేరుకుంటారనీ వరాన్ని ఒసగాడు. అందుకనే ప్రతి ఏకాదశినాడూ మన పెద్దలు క్రమం తప్పకుండా ఉపవాసం చేసేవారు. దీని వల్ల ఏకాదశి ఫలం అనే పుణ్యమూ, ఆరోగ్యమనే పురుషార్థమూ రెండూ లభించేవి. అయితే సూర్యడు ఉత్తరాయణంలోకి ప్రవేశించే ఈ ధనుర్మాసంలోని ముక్కోటి ఏకాదశినాడు కనుక ఉపవాసం చేస్తే, మిగతా ఏకాదశి రోజులలన్నింటిలోనూ ఉపవాసం ఉన్నంత ఫలం దక్కుతుందని నమ్మకం.

వైకుంఠ ఏకాదశినాడు తప్పకుండా ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ వ్రత విధానం ప్రకారం దశమినాటి రాత్రి నుంచే ఉపవాసానికి ఉపక్రమించాలి. ఏకాదశినాడు కేవలం తులసితీర్థాన్ని మాత్రమే సేవిస్తూ ఆహారానికి దూరంగా ఉండాలి. ముఖ్యంగా ఏకాదశినాడు బియ్యంలో మురాసురుడు నివసిస్తాడని చెబుతారు. బియ్యంతో చేసిన ఆహారం పూర్తిగా నిషిద్ధం అని కరాఖండిగా చెప్పేందుకే ఈ మాట అని ఉంటారు. ఏకాదశినాడు కేవలం ఉపవాసం ఉండటమే కాదు… ధ్యానంతోనూ, జపతపాలతోనూ కాలం గడపమని సూచిస్తారు పెద్దలు. ఇక ఆ రాత్రి కూడా భగవన్నామస్మరణతో జాగరణ చేయాలి. ఆకలి రుచి ఎరుగదు, నిద్ర సుఖమెరుగదు అన్నారు కదా! ఆ ఆకలి, నిద్రలు రెంటినీ తట్టుకుని, వాటిని అదుపులో ఉంచుకోవడమే ఏకాదశి వ్రత విశిష్ఠత. ఇక మరునాడు ద్వాదశినాడు ఎవరికన్నా అన్నదానం చేసి ఆ తరువాత ఉపవాసాన్ని విరమించాలి.

See also  Pavitrotsavam at Sri Lakshmi Venkateswaraswamy Temple, Devuni Kadapa

వైకుంఠ ఏకాదశినాడు వైష్ణవాలయాల్లో ప్రత్యేకంగా తెరిచి ఉంచే వైకుంఠ ద్వారంగుండా స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు ఎదురుచూస్తారు. కలియుగ వైకుంఠమైన తిరుమలలో కూడా ఈనాడు, శ్రీవారి గర్భాలయాన్ని ఆనుకుని ఉన్న వైకుంఠప్రదక్షిణ మార్గం ద్వారా భక్తులు నడిచే భాగ్యం లభిస్తుంది. ఏకాదశినాడు తిరుమలలో జరిగే మలయప్ప స్వామివారి ఊరేగింపు, ద్వాదశినాడు స్వామివారి పుష్కరణిలో జరిగే చక్రస్నానాలను దర్శించిన భక్తులు పుణీతులవుతారు.

ముక్కోటి ఏకాదశి మార్గశిర మాసంలో వస్తే కనుక ఆ ఏకాదశిని మోక్షదైకాదశి అని కూడా అంటారు. వైఖానసుడు అనే ఒక రాజు తన తండ్రిని నరకలోకం నుంచి తప్పించేందుకు ఏకాదశి వ్రతాన్ని నిష్ఠాగా ఆచరించాడట. ఆతని వ్రత ఫలితంగా తండ్రి నరకం నుంచి విడుదలై స్వర్గలోకానికి చేరుకున్నాడట. అందుకని ఈ ఏకాదశికి మోక్షదైకాదశి అన్న పేరు వచ్చింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here