godavari

గౌతమ మహర్షి దండకారణ్యంలో తన ఆశ్రమాన్ని నిర్మించుకొన్నాడు. దగ్గరలోనే ఒక పుష్కరిణి తవ్వించుకొన్నాడు. అందులో ఎప్పుడూ సమృద్ధిగా నీళ్లు ఉండేవి. పాడి పంటలతో ఆ ముని వాటిక సస్యశ్యామలంగా ఉండేది.
ఇలా ఉండగా ఆ ప్రాంతంలో తీవ్రమైన అనావృష్టి ఏర్పడింది. భూమి బీటలు వారింది. పంటలు పండలేదు. వాగులూ వంకలూ ఎండి పోయాయి. గుక్కెడు మంచి నీళ్లు దొరకక, జనం అలమటించసాగారు. పన్నెండేళ్ల పాటు తీవ్రమైన కరువు కొనసాగింది.

వర్షాలు కురిపించమని గౌతముడు వరుణదేవుని ప్రార్థించాడు. వరుణుడు కరుణించలేదు. గౌతముడు ఊరుకోలేదు. సూక్ష్మ శరీరంతో వరుణ లోకానికి బయలు దేరాడు. ఇది తెలిసి వరుణుడు తన నగరమైన శ్రద్ధావతి చుట్టూ మహా శక్తిమంతమైన మేఘ సమూహాలను కాపలా ఉంచాడు. గౌతముడు వాటిని చిందరవందర చేస్తూ శ్రద్ధావతిని చేరాడు.

వరుణుడు ‘నా అనుమతి లేకుండా నా నగరంలోకి ఎందుకు ప్రవేశించా’వని గద్దించాడు. కరువు పీడను గురించి చెప్పి, వానలు కురిపించమని ప్రార్థించాడు గౌతముడు. వీలు పడదని చెప్పి, వరుణ దేవుడు గౌతముని మీదికి తన పాశాయుధాలను విసిరాడు. ఆ మెరుపు తీగలతోనే గౌతముడు వరుణుడిని బంధించి తన ఆశ్రమానికి లాక్కువెళ్లాడు. అతడిని నీరుగా మార్చి పుష్కరిణిలోకి ప్రవహింపజేశాడు. ‘నువ్వు అమిత పుణ్యాత్ముడివి గనుక, నీకు కట్టుబడి ఉండవలసి వచ్చింది. నిన్ను పాపం అంటిన మరుక్షణం నేనిక్కడ ఉండను’ అని చెప్పి వరుణుడు అక్కడే ఉండి పోయాడు. లోకమంతా కరువు కాటకాలు తాండవిస్తున్నా గౌతముని ఆశ్రమ ప్రాంతం మాత్రం సుభిక్షంగా ఉంటున్నది.

పన్నెండేళ్ల కరువు పూర్తయింది. లోకమంతా వానలు కురిపించాల్సిన బాధ్యత వరుణుడిపై ఉంది. పుష్కరిణిలో బంధితుడైన వరుణుడికి కర్తవ్యం తోచలేదు. అతడు బ్రహ్మను తలచుకొన్నాడు.

ఒకనాడు పుష్కరిణి ప్రాంతంలోని వనంలోకి ఓ గోవు రాగా, గౌతముడు గడ్డి పరకతో దానిని అదిలించాడు. ఆ మాత్రానికే అది కింద పడి ప్రాణం కోల్పోయింది. గౌతముడికి గోహత్యా పాతకం చుట్టుకొంది. వరుణుడికి స్వేచ్ఛ కలిగింది. పుష్కరిణి ఎండిపోయింది.

గౌతముడు బ్రహ్మ గిరికి వెళ్లి శివుణ్ని గురించి తపస్సుచేశాడు. శివుడు ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు. శివ జటాజూటం నుంచి గంగను విడువమన్నాడు గౌతముడు. నేలమీదికి దూకిన గంగను గోవు కళేబరం వద్దకు తీసుకుపోయాడు గౌతముడు. గంగ తనను తాకగానే గోవు ప్రాణంతో లేచి నిలబడింది. గౌతమ మహర్షిని అంటిన పాపం తొలగిపోయింది. సప్తర్షులు గంగను వెంటబెట్టుకుపోయి, ఆమెను సముద్రుడికి అప్పగించారు.

గంగా ప్రవాహం దక్షిణా పథాన్ని సస్యశ్యామలంగా మార్చింది. గౌతముడి వల్ల ఏర్పడింది కనుక గౌతమి అని గోవును బతికించింది కనుక గోదావరి అని ఆ నదికి పేర్లు వచ్చాయి.

See also  Rameswaram Temple

సేకరణ:సొంటేల ధనుంజయ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here