ఆగస్టు 12 నుంచి 14వ తేదీ వరకు తెలుగు రాష్ట్రాల్లో ‘మనగుడి’

148
Lord Srinivasa

ధర్మప్రచారంలో భాగంగా గోకులాష్టమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆగస్టు 12 నుంచి 14వ తేదీ వరకు ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లోని 1,250 మండలాల్లో మనగుడి కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు టిటిడి తిరుపతి జెఈవో శ్రీ పోల భాస్కర్‌ తెలిపారు. టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్‌ ఆధ్వర్యంలో తిరుపతిలోని శ్వేత భవనంలో శనివారం మనగుడి సామగ్రిని సిద్ధం చేశారు.

ఈ సందర్భంగా జెఈవో మాట్లాడుతూ గోకులాష్టమి పర్వదినం సందర్భంగా శ్రీకృష్ణుని ఆలయాల్లో మనగుడి కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు. ఇందులో భాగంగా ఆగస్టు 12న ఆలయశోభ, ఆగస్టు 13న నగరసంకీర్తన, ఆగస్టు 14న గోపూజ, ఉట్లోత్సవం చేపడతామని తెలిపారు. ఇందుకోసం పసుపు, కుంకుమ, అక్షింతలు, కలకండ, కంకణాలు కలిపి ప్యాకెట్లుగా సిద్ధం చేశామన్నారు. వీటిని ఆయా జిల్లాల్లోని ధర్మప్రచార మండళ్ల ద్వారా ఆలయాలకు చేరవేస్తామన్నారు. ఆయా ప్రాంతాల్లో జిల్లా ధర్మప్రచార మండలి సభ్యులు, దాససాహిత్య ప్రాజెక్టు భజన మండళ్ల సభ్యులు, శ్రీవారి సేవకులు, విద్యార్థులు కలిసి మనగుడి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు.

ఈ కార్యక్రమంలో టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్‌ కార్యదర్శి శ్రీ రామకృష్ణారెడ్డి, ఏఈవో శ్రీ నాగేశ్వరరావు, సూపరింటెండెంట్‌ శ్రీ గురునాథం, పురాణ పండితులు, శ్రీవారి సేవకులు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

Advertisements