17వ తేది నుంచి దివ్యదర్శనం భక్తులకు ప్రతిరోజు 20 వేల టోకెన్లు జారీ – జేఈవో శ్రీ కెఎస్‌. శ్రీనివాసరాజు

242
token

శ్రీవారి దర్శనార్థం కాలినడకన తిరుమలకు వచ్చే దివ్యదర్శనం భక్తులకు 17వ తేది సోమవారం నుంచి ప్రతి రోజు 20 వేల టోకెన్లు జారీ చేయనున్నట్లు టిటిడి జెఈవో శ్రీ కెఎస్‌. శ్రీనివాసరాజు వెల్లడించారు. తిరుమలలోని జెఈవో క్యాంపు కార్యాలయంలో శుక్రవారం సాయంత్రం ఆయన అధికారులతో సమీక్ష నిర్వహించారు. 

ఈ సందర్భంగా జేఈవో మాట్లాడుతూ సోమవారం నుంచి కాలినడక అలిపిరి మార్గం ద్వారా తిరుమలకు వచ్చే భక్తులకు 14వేల టోకెన్లు, శ్రీవారి మెట్టు మార్గం ద్వారా వచ్చే భక్తులకు 6 వేల దివ్యదర్శనం టోకెన్లను జారీ చేయనున్నట్లు తెలిపారు. అలిపిరి, శ్రీవారిమెట్టు మార్గాలలో  భక్తులకు మరిన్ని మెరుగైన సేవలను అందించాలని అధికారులకు ఆయన పలు సూచనలు చేశారు. టోకెన్ల జారీ కేంద్రాలు, లగేజీ కేంద్రాలలో భక్తులకు సాంకేతికంగా ఇబ్బందులు తలెత్తకుండా చూడాలన్నారు. ఈ రెండు మార్గాలలో దివ్యదర్శనం భక్తులకు దర్శనం, టోకెన్ల జారీ, లగేజీ, తదితర సమాచారం ఎప్పటికప్పుడు డిస్‌ప్లే బోర్డుల ద్వారా తెలియజేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. 

అంతకుముందు సీఆర్‌వో కార్యాలయంలో గదుల టోకెన్ల జారీ కేంద్రంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. టోకెన్ల జారీలో సాంకేతిక సమస్యలు తలెత్తకుండా అప్రమత్తంగా               ఉండాలని సూచించారు. గదుల కోసం వచ్చే భక్తుల వివరాలు సేకరణ, గదులను పొందే క్రమంలో తిరుమలలో ఆయా ప్రాంతాలను  సులభంగా గుర్తించేలా సూచిక బోర్డులను ఏర్పాటు చేయాలన్నారు. 

ఈ కార్యక్రమంలో ఎస్‌ఈ 2 శ్రీ రామచంద్రారెడ్డి, విజివో శ్రీ రవీంద్రారెడ్డి, ఐటి అధికారి  శ్రీ శేషారెడ్డి, డిప్యూటీ ఈవో శ్రీ హరీంద్రనాథ్‌, ఈడీపీ ఓఎస్‌డి శ్రీ బాలాజీ ప్రసాద్‌, ఇతర అధికారులు పాల్గొన్నారు. 

Advertisements