తిరుమలలో  ఘనంగా గోకులాష్టమి వేడుకలు

122

కలియుగ ప్రత్యేక్షదైవమైన శ్రీ వేంకటేశ్వరస్వామి కొలువై వున్న తిరుమల దివ్య క్షేత్రంలో మంగళవారం గోకులాష్టమి వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించారు. 

ఇందులో భాగంగా మధ్యాహ్నం 11.30 గం||లకు తిరుమలలోని గోగర్భం ఉద్యానవనాలలో జన్మాష్టమి, ఉట్లోత్సవ వేడుకలను కన్నుల పండుగగా నిర్వహించారు. పుణ్యాహవచనం అనంతరం ఉద్యానవనాల్లో వెలసివున్న కాళీయమర్థనునికి శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. అనంతరం గోక్షీరం, పెరుగు, తేనె, పరిమళం, చందనం ఇత్యాది ద్రవ్యాలతో అభిషేకాదులు నిర్వహించారు. ఆపై గోవర్థనునికి తలపాగా, ఉత్తరీయం, దోవతిలను ధరింపజేసి పూలమాలలతో శోభాయమానంగా అలంకరించారు. అనంతరం జరిగిన ఉట్లోత్సవం కార్యక్రమంలో యువకులు ఉత్సాహంతో పాల్గొని ఉట్లను పగులగొట్టారు. ఈ వేడుకలను తిలకించడానికి భక్తులు విశేషసంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం ప్రసాదవితరణ కార్యక్రమం నిర్వహించారు. 

ఈ వేడుకల్లో ఉద్యానవనశాఖ ఉపసంచాలకులు శ్రీ శ్రీనివాస్‌, ఉద్యానవనశాఖ సిబ్బంది తదితర అధికారులు పాల్గొన్నారు.

శ్రీవారి ఆలయంలో ఘనంగా కృష్ణష్టమి అస్థానం:

శ్రీవారి ఆలయంలో ద్వాపర యుగ పురుషుడైన శ్రీకృష్ణున్ని జన్మష్టమిని పురస్కరించుకొని శ్రీకృష్ణజన్మాష్టమి అస్థానాని రాత్రి 8.00 నుండి 10.00 గంటల వరకు బంగారు వాకిలి చెంత నవనీత చోర కృష్ణునికి అర్చకులు ఆగమోక్తంగా ఆస్థానం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా శ్రీకృష్ణ అవతార ఘట్టాన్ని అర్చకులు పురాణ పఠనం గావించి, హారతి నైవేద్యాలు సమర్పించడంతో సాలకట్ల గోకులాష్టమి ఆస్థానం వైభవంగా ముగుస్తుంది. 

Advertisements

Leave a Reply