నల్లగొండ పట్టణానికి కూతవేటు దూరంలో పానగల్లు ఉంది. ఆ ఊరి శివారులో ఉదయ సముద్రం.. దాని పక్కన పచ్చటి పొలాల మధ్య ఓ పురాతన దేవాలయం. 11వ శతాబ్దపు కుందూరు చోళుల కాలం నాటిది.
దీని పేరు ఛాయా సోమేశ్వరాలయం. ఆ పేరులోనే దాని మిస్టరీ దాగి ఉంది. మనం ఉదయించే సూర్యుడి ఎదురుగా నిలబడితే మన నీడ ఎక్కడ పడుతుంది? మన వెనుక వైపు పడుతుంది కదా. అదే మధ్యాహ్నం నిలబడితే నీడ ముందుకు పడుతుంది.
అయితే గుడిలోని శివలింగంపై పడే నీడ ఉదయం అయినా, మధ్యాహ్నం అయినా ఎప్పుడూ కదలదు. ఆ నీడ ఒక స్తంభం నీడలా కనిపిస్తుంది.
ఆ గుడిలో ఎనిమిది స్తంభాలుంటాయి, కాని ఆ నీడ ఏ స్తంభానిదో కూడా ఎవరూ చెప్పలేరు. ఎందుకంటే ఒక స్తంభం నీడ అని మనం అనుకున్నామనుకోండి, దాని నీడ పడినప్పుడు దాన్ని పట్టుకుంటే మన చెయ్యి మీద పడాలి, కాని అలా పడదు.
ఆ నీడ ఎక్కడినుంచి పడుతుంది. రోజంతా స్థిరంగా ఎలా ఉంటుందనేది అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంటుంది.
వందల ఏళ్ల చరిత్ర
ఛాయా సోమేశ్వరాలయం వందల ఏళ్ళకు పైగా చరిత్ర కలిగి ఉంది.
మూడు గర్భగుడులు కలిగి త్రికూటాలయంగా ప్రఖ్యాతి చెందింది. ఈ ఆలయం కళ్యాణి చాళుక్యుల కాలం నాటి గణిత, భౌతిక శాస్త్ర మేధస్సుకు చిహ్నం. ఆలయంలో పశ్చిమాన ఉండి తూర్పునకభిముఖంగా ఉన్న గర్భగుడిలో స్తంభాకారం గల ఒక నిశ్చల ఛాయ సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరుకు భానుడి స్థానంతో సంబంధం లేకుండా మహా శివలింగం మీదుగా నిలకడగా ఉంటుంది.
ఆలయం తూర్పు వైపు నుంచి లోనికి ప్రవేశించే పరిక్షేపణ సూర్య కాంతి వల్ల ఏక నిశ్చల ఛాయ ఏర్పడుతుంది.
మిగతా రెండు గర్భ గుడులు కూడా ఒకే రీతి విమాన శైలి కలిగి ఉన్నా ఎలాంటి ఛాయలు ఏర్పడవు. ఆలయాన్ని నిర్మించిన వారు తెలివిగా పశ్చిమాన ఉన్న గర్భ గుడికి ఇరు వైపులా అడ్డంకులు ఏర్పాటుచేసి కాంతిని ఆలయంలోకి ప్రవేశించకుండా చేశారు. ఉత్తరాన ఉన్న గర్భగుడికి ఎదురుగా ఆలయం ప్రధాన ద్వారం ఉండటం వల్ల ఎలాటి ఛాయలు ఏర్పడవు. ఆలయ ద్వారం స్థానంలో నాలుగో గర్భగుడి నిర్మించినట్లైతే ప్రజలకు నాలుగు గదుల్లో ఏక ఛాయలను వీక్షించే అవకాశం ఉండేది.
అయితే ఉత్తర, దక్షిణ గర్భగుడుల్లో ఏర్పడిన ఏక ఛాయలు నిశ్చలంగా ఉండకుండా సూర్యుడు తూర్పునుంచి ప్రయాణించినప్పుడు అవి పడమర నుంచి తూర్పుకు కదులుతాయి.
ఇకపోతే తూర్పు పడమర గర్భగుడుల్లో ఛాయలను కలిగిన తలము సూర్యుడు ప్రయాణించే దిశకు సమాంతరంగా ఉండటం వల్ల ఆ ఛాయలు నిశ్చలంగా ఉంటాయని తెలుస్తుంది. ఉత్తర, దక్షిణ గర్భగుడుల్లో ఛాయలను కలిపే తలము సూర్యుడు ప్రయాణించే దిశకు లంబంగా ఉండటం వల్ల అవి కదులుతాయి.
భౌతికశాస్త్రంలోని కాంతి పరిక్షేపణ సిద్ధాంతాన్ని ఉపయోగించి సోమేశ్వర దేవాలయాన్ని నిర్మించారు.
ఈ రహస్యానికి సంబంధించి తాను కనుగొన్న అంశాలను, ప్రయోగాలను ఆర్కియాలజీ డిపార్ట్‌మెంటుకు చెందిన శివనాగిరెడ్డి ఆమోదించినట్లు సూర్యాపేటకు చెందిన భౌతిక శాస్త్రవేత్త మనోహర్ తెలిపారు.
జలాల్‌పురంలో..
సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలం జలాల్‌పురం గ్రామంలోని శివాలయంలో కూడా నల్లగొండలోని ఛాయా సోమేశ్వరాలయం మాదిరిగానే పరిస్థితులుండటం విశేషం..
అక్కడ.. పానగల్లు ఆలయానికి పూర్వ నమూనాలో సోమేశ్వరాలయం నెలకొని ఉండడాన్ని భౌతిక శాస్త్రవేత్త శేషగాని మనోహర్ గౌడ్ కనుగొన్నారు.
గతంలో పానగల్‌లోని ఛాయా సోమేశ్వరాలయంలో నీడగా పడే శివలింగం రహస్యాన్ని వెలుగులోకి తీసుకువచ్చిన మనోహర్‌ను ప్రభుత్వం, టూరిజం శాఖ ప్రోత్సహించినట్లైతే మరుగున పడిన చరిత్ర వెలుగులోకి వచ్చే అవకాశాలు అధికంగా ఉంటాయని చెప్పవచ్చు.
Surya Jayanti – Rathasapthami at Tiruchanur On the sacred occasion of Surya Jayanti, the grand…
Tirumala Pournami Garuda Seva Tirumala Pournami Garuda Seva will be observed on every month Full…
Tirumala Srivari Akshintalu TTD’s “Srivari Aseervadam” brings the divine grace of Sri Venkateswara to newly…