అవగాహన లేక… గదులు పొందలేక…తిరుమలలో తొలిరోజు భక్తుల గందరగోళం

431
Rooms in Tirumala

తిరుమలలో అద్దె గదుల కేటాయింపులో ప్రవేశపెట్టిన కొత్త విధానంపై సరైన అవగాహన లేకపోవడంతో తొలిరోజు భక్తులు కొంత గందరగోళానికి లోనయ్యారు. గదుల కోసం రిజిస్ట్రేషన్‌ చేసుకున్న తర్వాత తితిదే కేటాయించినప్పటికీ కొందరు పొందలేకపోయారు. గంటల తరబడి వేచి ఉండే సమయాన్ని తగ్గించడం, పారదర్శకత పాటించడం కోసం టోకెన్ల ద్వారా గదుల కేటాయించే విధానాన్ని బుధవారం నుంచి తితిదే అమలులోకి తెచ్చింది. గదులు కేటాయిస్తూ చరవాణికి అందిన సందేశం ఆంగ్లంలో ఉండటంతో కొందరికి అర్థం కాలేదు.

నిర్ధేశిత సమయంలో నగదుచెల్లించలేక గదులుపొందలేకపోయారు. కొందరు నగదు చెల్లించకుండానే.. వారికి కేటాయించిన సత్రానికి వెళ్లి తాళాలు ఇవ్వాలంటూ సిబ్బందిని పట్టుబట్టడం కనిపించింది. గది రిజిస్ట్రేషన్‌, నగదు చెల్లింపునకు రెండుసార్లు రావాల్సి వస్తోందంటూ యాత్రికులు పెదవి విరిచారు.

కొందరు తమ వద్ద లేని సెల్‌ఫోన్‌ నెంబర్లు ఇవ్వడంతో.. ఆ నెంబర్లకు వెళ్లిన సంక్షిప్త సందేశం చూసుకోలేక గదులు పొందలేకపోయారు. నూతన విధానాన్ని పూర్తిగా అర్థం చేసుకున్న యాత్రికులు మాత్రం.. ఈ పద్ధతి బాగుందని, అక్రమాలకు తావులేదని అభిప్రాయపడ్డారు.

Advertisements