మానసిక ఒత్తిళ్లకు యోగా నిజమైన ఔషధం :  టిటిడి జెఈవో శ్రీ పోల భాస్కర్‌

245
Yoga

ఆధునిక జీవన విధానంలో మానసిక ఒత్తిళ్లకు యోగా నిజమైన ఔషధమని టిటిడి తిరుపతి జెఈవో శ్రీ పోల భాస్కర్‌ పేర్కొన్నారు. శ్రీవేంకటేశ్వర ఆయుర్వేద కళాశాల ప్రాంగణంలో 3వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని బుధవారం టిటిడి ఘనంగా నిర్వహించింది.ఆధునిక జీవన విధానంలో మానసిక ఒత్తిళ్లకు యోగా నిజమైన ఔషధమని టిటిడి తిరుపతి జెఈవో శ్రీ పోల భాస్కర్‌ పేర్కొన్నారు. శ్రీవేంకటేశ్వర ఆయుర్వేద కళాశాల ప్రాంగణంలో 3వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని బుధవారం టిటిడి ఘనంగా నిర్వహించింది.
ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా హాజరైన జెఈవో మాట్లాడుతూ యోగా అంటే ఆసనాలు, శారీరక వ్యాయామం మాత్రమే కాదని, మానసిక ప్రశాంతతకు ఇది ఎంతగానో దోహదపడుతుందని అన్నారు. యోగా అత్యంత పురాతనమైనదని, వేదకాలం నుంచి దాని ప్రస్తావన ఉందని తెలిపారు. మానవుని సంపూర్ణ ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడుతుందన్నారు. యోగా పుట్టిన భారతదేశంలోనే వాటి పట్ల శ్రద్ధాశక్తులు తగ్గాయని, వాటిని పూర్వ దశకు తీసుకువచ్చేందుకు దేశ ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోడీ జూన్‌ 21వ తేదీని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ప్రకటించారని తెలిపారు. ఈ సందర్భంగా శ్రీ వేంకటేశ్వర ఆయుర్వేద కళాశాల ప్రాంగణంలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని టిటిడి చేపట్టిందన్నారు. ఈ కార్యక్రమాన్ని అందరూ వీక్షించేందుకు వీలుగా ఎస్వీబీసీలో ప్రత్యక్ష ప్రసారం అందించామన్నారు. ఎస్వీ యోగాధ్యయన కేంద్రాన్ని పునరుద్ధరించి, టిటిడి కళాశాలల్లో ఎంపిక చేసిన విద్యార్థులకు శిక్షణ ఇస్తామని, వీరి ద్వారా మిగిలిన విద్యార్థులకు కూడా నేర్పిస్తామని వెల్లడించారు.
అంతకుముందు విశాఖపట్నంకు చెందిన శ్రీసత్యసాయి సేవా సంస్థ ప్రతినిధి శ్రీ రఘు గురూజీ ఈ సమావేశానికి హాజరైన విద్యార్థిని విద్యార్థులకు యోగాసనాలు ఎలా వేయాలి, వాటి వల్ల ఉపయోగాలను తెలియజేస్తూ శిక్షణ ఇచ్చారు. యోగాకు భారతదేశం విశ్వ గురువు అని శ్రీరామకృష్ణమఠం కార్యదర్శి శ్రీ అనుపమానంద స్వామీజీ అన్నారు. జీవితంలో లక్ష్యాన్ని సాధించాలంటే ఆరోగ్యం బావుండాలని, అందుకు యోగా ఒక్కటే ఉత్తమమైన ఆయుధమని తెలిపారు.
అనంతరం శ్రీ రామకృష్ణ మఠం కార్యదర్శి శ్రీ అనుపమానంద స్వామీజీ, శ్రీ సత్యసాయి సేవా సంస్థ ప్రతినిధి శ్రీ రఘు గురూజీలను శాలువ, శ్రీవారి చిత్రపటాలతో జెఈవో శ్రీ పోల భాస్కర్‌ సత్కరించారు.
ఈ కార్యక్రమంలో ఎస్వీ ఆయుర్వేద కళాశాల ప్రిన్సిపాల్‌ డా|| ఎ.శంకర్‌బాబు, ఇతర అధికారులు, సిబ్బంది, టిటిడి కళాశాలల విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు.

Advertisements