శ్రీ ఆదిభట్ట నారాయణదాస విగ్రహానికి ఘనంగా పుష్పాంజలి

0
112
narayanadas

 

హరికథా పితామహునిగా వినుతికెక్కిన శ్రీమదజ్జాడ ఆదిభట్ట నారాయణదాస 153వ జయంతిని పురస్కరించుకుని తిరుపతిలోని టిటిడి శ్రీ వేంకటేశ్వర సంగీత, నృత్య కళాశాల ప్రాంగణంలోని ఆయన విగ్రహానికి ఆదివారం కళాశాల ప్రిన్సిపాల్‌ శ్రీమతి వైవిఎస్‌.పద్మావతి, హరికథా విభాగాధిపతి శ్రీ ఎం.వి.సింహాచలశాస్త్రి పుష్పాంజలి సమర్పించారు. ఆనంతరం  కళాశాల విద్యార్థులు బృందగానం నిర్వహించారు. 

మూడు రోజుల పాటు సాయంత్రం 6.00 నుండి రాత్రి 9.00 గంటల వరకు ఎస్వీ సంగీత, నృత్య కళాశాల ఆధ్వర్యంలో తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో ఈ ఉత్సవాలు ఘనంగా నిర్వహించనున్నారు. 

నారాయణదాసవర్యులు 1864, ఆగస్టు 31వ తేదీన విజయనగరం జిల్లా అజ్జాడ గ్రామంలో శ్రీలక్ష్మీనరసమాంబ, వేంకటచయన దంపతులకు జన్మించారు. సంగీత, సాహిత్యాల్లో బాల్యం నుంచే ఈయన అద్భుతమైన ప్రతిభాపాఠవాలు ప్రదర్శించేవారు. పోతన భాగవత పద్యాలు, ఇతర శతక పద్యాలను ఐదేళ్ల ప్రాయంలోనే అవలీలగా వల్లించేవారు. ఉపమాన ఉపమేయాలను పోషించండంలో నారాయణదాసవర్యులు కాళిదాస మహాకవికి సమానమైనవారు. వీరు రచించిన హరికథా రచనలు, సాహిత్యగ్రంథాలు, సంగీతరూపకాలు కవి, గాయక, పండితులకు మనోజ్ఞమైన ఆనందాన్ని కలిగించాయి. ఈయన రచించిన సావిత్రిచరిత్ర, జానకీశపథం, భక్తమార్కండేయ చరిత్ర, రుక్మిణీ కల్యాణం హరికథా వాఙ్మయంలో నాలుగు వేదాలు లాంటివి. ఏకకాలంలో ఐదు విధాల లయలను ప్రదర్శించడం ఈయనకే సాటి. ఈయనకు పంచముఖేశ్వర అనే బిరుదు ఉంది. సంగీత, సాహిత్యాలను సరితూచిన త్రాసు నారాయణదాసు అని తిరుపతి వేంకటకవులు, శ్రీశ్రీ లాంటి మహానుభావులు కొనియాడారు.

ఈ కార్యక్రమంలో ఎస్వీ సంగీత కళాశాల అధ్యాపకులు, ఇతర అధికార ప్రముఖులు,  కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు.

Advertisements

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here